అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళా పేషెంట్స్ ఉన్న గదుల్లో సీసీకెమెరాలు ఉన్నాయి. కెమెరాలను గమనించని మహిళా పేషెంట్స్, పేషెంట్స్ తాలూకు సహాయకులు..గదుల్లోనే దుస్తులు మార్చుకుంటున్నారు.
ఈక్రమంలో ఆదివారం కెమెరాలను గమనించిన కొందరు వ్యక్తులు..ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు. మహిళలు దుస్తులు మార్చుకునే ప్రాంతంలో కెమెరాలు ఎందుకు పెట్టారంటూ ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించారు.అయితే ఆ కెమెరాలు కరోనా సమయంలో పెట్టినవని..ప్రస్తుతం పనిచేయడం లేదంటూ ఆసుపత్రి సిబ్బంది సమాధానం ఇచ్చారు. కాగా, సిబ్బంది సమాధానంపై అనుమానం వ్యక్తం చేసిన బాధితులు..సీసీ ఫుటేజీలను పరిశీలించారు.
మహిళా పేషెంట్స్ దుస్తులు మార్చుకున్న దృశ్యాలు రికార్డు అవడం చూసి అక్కడున్నవారు కంగుతిన్నారు. ఆసుపత్రి యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..డ్యూటీ డాక్టర్ ను నిలదీశారు. పేషెంట్స్ రూంలతో పాటు ఆపరేషన్ థియేటర్లోను సీసీకెమెరాలు ఉన్నాయని గుర్తించిన బాధితులు..ఆసుపత్రి యాజమాన్యం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
