ఏడాదిలో 200 రోజులు పని భద్రత కల్పించండి.
ప్రైవేటికరణ, మానిటైజషన్ రద్దు చేయండి.
మీడియా పవర్, విశాఖపట్నం: దేశంలో రోజురోజుకి పెరుగుతున్న ఇంధన ధరలు తగ్గించాలని, పన్నులు పేరుతో సామాన్యుడి నడ్డి విరచడం ఎంత వరకు సమంజసమని .. ఏపీ స్టేట్ ఓబీసి డిపార్ట్మెంట్ చైర్మన్ మూల వెంకట్రావు ప్రశ్నించారు. ఇటీవల 6 రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తి అయిన 6 రోజులలోనే పెట్రోల్ పై 3.75 రూపాయలు పెరిగిందని గుర్తు చేసారు. అయితే ఎన్నికలు ముగిసిన కొద్దీ రోజులలోనే పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయని మా నాయకులు రాహుల్ గాంధీ ముందుగానే హెచ్చరించారని మూల వెంకట్రావు తెలిపారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల సంక్షేమం కొరకు చిత్తశుద్ధితో కనీస వేతనం 26,000/- రూపాయలుగా ప్రకటించాలని పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేసారు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర సరుకులు ధరలను అరికట్టడానికి నిర్థిష్ట చర్యలను తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలుకు కేటాయింపు పెంచాలని.. సంవత్సరానికి కనీసం 200రోజులు పని భద్రత కల్పించాలని, ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంయుక్త కిసాన్ మోర్చాతో అంగీకారానికి వచ్చిన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, వ్యవసాయం, విద్య, వైద్యం, మరియు ఇతర ప్రజా అవసరాలకు ప్రభుత్వ కేటాయింపులు పెంచాలన్నారు. అత్యంత ధనవంతుల పై సంపద పన్ను వేసి దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించాలని డిమాండ్ చేసారు. భవన నిర్మాణ రంగం, హమాలీ, ఆటో, ప్రైవేట్ రవాణా తదితర రంగాల అసంఘటిత కార్మికులందరికి ఎటువంటి పరిమితి లేకుండా సామాజిక భద్రత కల్పించాలని దేశ ప్రజలంతా డిమాండ్ చూస్తున్నారని మూల వెంకట్రావు తెలిపారు. కావున ప్రైవేటికరణ, మానిటైజషన్ రద్దు చేయాలని, విశాఖ స్టీల్ తో సహా దేశంలోని అనేక ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థలను ప్రైవేటీకరణ చేయరాదని, ఈ రోజు 28వ తేదీన దేశ వ్యాప్తంగా ఈ సమస్యలపై సమ్మె జరుగుతుందన్న విషయాన్నీ గుర్తుచేశారు. కావున పై సమస్యలన్ని కేంద్ర ప్రభుత్వం మానవత హృదయంతో పరిశీలించి, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాలంటిపై దృష్టి సారించి ప్రజా అవసరాలకు అనుగుణంగా తగు నిర్ణయం తీసుకోవాలని ఏపీ స్టేట్ ఓబీసి డిపార్ట్మెంట్ చైర్మన్ మూల వెంకట్రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
