జూలై 20 సుముహూర్తం
ఏ పదవి ఇచ్చినా చిత్తశుద్ధితో.... అంకిత భావంతో పనిచేస్తా..
15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు వ్యక్తిగత దూషణలు చేయలేదు.
విశాఖపట్నం : మనస్తాపం చెందడం వల్లే నగర అధ్యక్ష పదవికి, వైసీపీ పార్టీకి, రాజీనామా చేసినట్టు మరోసారి స్పష్టం చేసారు పంచకర్ల రమేష్ బాబు. పార్టీ అధ్యక్షుడిని అయిన తనచేత బి ఫారం ఇప్పించకుండా అభ్యర్థులకే నేరుగా అందించడాన్ని తప్పుపట్టారు. వైసీపీ నగర అధ్యక్షులుడిగా తనకు దక్కవల్సిన గౌరవం అందలేదని అలాంటిచోట ఇమడలేక జనసేన అధినేత పవన్ కళ్యాన్ని కలిశానని తెలిపారు. ఆయన చేస్తున్న పోరాటపటిమ చూసి ముగ్దుడైనానని తెలిపారు. ఈనెల 20వ తేదీన 400 కార్లు, 25 బస్సులలో బయలుదేరి అభిమానుల సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్టు పంచకర్ల రమేష్ బాబు ప్రకటించారు. సీతమ్మధార లోని కల్యాణమండపం ప్రాంగణంలో మంగళవారం ఉదయం ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో పంచకర్ల పై విషయాలు తెలిపారు. 15 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఎప్పుడూ ఏ పార్టీని కించపరిచే విధంగా రాజకీయాలు చేయలేదని, వ్యక్తిగత దూషణకు పాల్పడలేదని కుండబద్దలుకొట్టినట్టు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా తప్పుపట్టడం లేదని, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అంటే తనకెంతో గౌరవమని, ఆయన ఎప్పుడు వచ్చినా ముందుగా వెళ్లి పార్టీ పరిస్థితులను చెప్పేవాడినని తెలిపారు. అధికార పార్టీలో వున్నప్పటికీ పార్టీ నుంచి ఎటువంటి లబ్ధి పొందలేదన్నారు. నియోజకవర్గం వారీగా కార్యక్రమాలు చేసినప్పుడు మీ సమన్వయకర్తని గెలిపించుకోవాలని ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి చెప్పడం జరుగుతుందని, ఇదే పరిణామం మనస్తాపం చెందదానికి కారణమని తెలిపారు. పార్టీ బలోపేతానికి సొంత నిధులు వెచ్చించానే తప్పితే ఆర్థికంగా ఆస్తులేవీ సంపాదించలేదన్నారు. ప్రస్తుతం నేను మాత్రమే పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నానని, ఏ పార్టీ అయినా కార్యకర్తలను గుర్తించి వారికి వెన్నెముకగా పార్టీ అండ దండాలు ఉండాలని తెలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచనలకు, ఆశయాలకు ఆకర్షితుడినై కార్యకర్తగా పని చేయడానికి సిద్ధపడినట్లు తెలిపారు. తన అభిమానులు, కార్యకర్తలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. నా రాజకీయ నేపథ్యమంతా సమస్యలపై పోరాడటానికి వినియోగించానని, వ్యక్తిగత లబ్దికోసం పార్టీలపై బురదజల్లే ప్రయత్నం ఎప్పుడు చేయలేదని, భవిష్యత్లో చేయనని జనసేన గెలుపుకోసం 20వ తేదీ అనంతరం ప్రణాళికలు సిద్ధం చేస్తానని తెలిపారు.