- మాడుగులలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్లె అనురాధ విస్తృత ప్రచారం
- మోడల్ గానే కాదు మోడరన్ గా కూడా చేసి చూపిస్తా
మాడుగుల, ఏప్రిల్ 29: మాడుగుల ప్రాంతాన్ని మోడల్గా అభివృద్ధి చేసిన ఘనత డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడుకు దక్కుతుందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనురాధ తెలిపారు. అతి తక్కువ కాలంలోనే గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో మౌలిక సదుపాయాలు కల్పించి అనూహ్య రీతిలో అభివృద్ధిని చేసి చూపించిన నాయకుడు ముత్యాలనాయుడు అని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని మోడల్ మాడుగులను మోడ్రన్ మాడుగులగా తీర్చిదిద్దే దిశగా సేవ చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనురాధ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. అనంతరం గ్రామ గ్రామానికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన మేనిఫెస్టో సవివరంగా వివరించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని నెరవేర్చిందని అయితే కూటమి అభ్యర్థులు కల్లబొల్లి హామీలతో ప్రజలకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టే దిశగా ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.నవరత్నాలుతో ఎన్నడూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అందిస్తూ, వాటిని 99 శాతం అమలు చేసి ఇప్పుడు మీ ముందుకు వచ్చిందని భవిష్యత్తులో మరిన్ని మంచి పథకాలకు శ్రీకారం చుట్టిన వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించి, రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను ఆమె అభ్యర్థించారు. ఆమె వెంట ఎంపీపీ తాళ్లపురెడ్డి వేంకట రాజారాం, మాజీ ఎంపీపీ రామధర్మజా, మండల కన్వీనర్ బొమ్మిశెట్టి శ్రీను, గ్రామల ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.