*కేజీహెచ్ మార్చురీ వద్ద బాధిత కుటుంబాలను పరామర్శించిన కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
విశాఖపట్టణం: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా సెజ్ ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, ఉద్యోగుల బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించనున్నట్లు విశాఖపట్టణం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. కేజీహెచ్ మార్చురీ వద్ద బాధిత కుటుంబాలను జిల్లా కలెక్టర్ గురువారం ఉదయం పరామర్శించి ఓదార్చారు. వారితో మాట్లాడి దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన మీడియాతో కలెక్టర్ మాట్లాడారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నష్ట పరిహారం చెల్లింపు, క్షతగాత్రులకు వైద్య చికిత్సకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి, వారసులకు రూ.కోటి పరిహారం చెల్లించనున్నట్లు వివరించారు. క్షత గాత్రులకు చెల్లించే పరిహారం విషయంలో ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ఫార్మా సెజ్లో జరిగిన ఉదంతం అనుకోని దుర్ఘటన అని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి, విశాఖపట్టణం జిల్లాల యంత్రాంగాలు సకాలంలో స్పందించి చాలా మంది ప్రాణాలు కాపాడగలిగాయని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన 12 మృతదేహాలు కేజీహెచ్ కు వచ్చాయని, గురువారం మధ్యాహ్నం నాటికి పోస్టు మార్టం పూర్తి చేసి సంబంధిత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు. గాయపడిన వారిలో పది మంది విశాఖపట్టణంలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వెంకోజిపాలెంలోని మెడికవర్ ఆసుపత్రిలో ఏడుగురు, కిమ్స్ ఆసుపత్రిలో ముగ్గురు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వారంతా ప్రస్తుతం బాగానే ఉన్నారని తెలిపారు. మిగిలిన వారు అనకాపల్లి జిల్లాలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించారు. మొత్తం 41 మంది గాయపడ్డారని చెప్పారు. దుర్ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడామని తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.