ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అన్నవరం యూనియన్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఉదయం 8.30 గంటల సమయంలో షార్ట్ సర్యూట్ తో బ్యాంకులో మంటలు చెలరేగాయి. బ్యాంకు నుంచి మంటలు వ్యాపించడం చూసిన స్థానికులు.. అధికారులకు..అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం ఇచ్చారు.
దీంతో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ అగ్నిప్రమాదంలో.. బ్యాంకులోని ఫర్నిచర్, ఇతర సామాగ్రి కాలిపోయినట్లుగా తెలుస్తోంది.
కానీ నగదు, అలాగే డాక్యుమెంట్స్ భద్రపరిచే లాకర్ సురక్షితంగా ఉన్నట్టుగా సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జరిగిన నష్టం గురించి కొంతసేపు తరువాత అధికారులు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది.
