అమ్మ ఒడి’ పథకానికి మంగళం పాడేందుకే ప్రభుత్వం కొత్త ఆంక్షలు తెచ్చిందని ఆయన ఆరోపించారు. నవ రత్నాల్లో ఒక్కో రత్నం రాలిపోతోందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తన పథకాలను తానే కాలగర్భంలో కలిపేసుకునేందుకు సిద్ధమైందన్నారు. అందులో భాగంగానే ‘అమ్మ ఒడి’ పథకాన్ని క్రమంగా పక్కకు పెట్టేసేందుకే ఆంక్షలు విధిస్తోందన్నారు నాదెండ్ల మనోహర్. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ పథకం నుంచి ఒక్క నయా పైసా కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎగ్గొట్టారని చెప్పారు. లబ్ధిదారులు ప్రశ్నిస్తే జూలైలో ఇస్తామని చెప్పారని అన్నారు.
రాబోయే విద్యా సంవత్సరంలో కూడా అమ్మ ఒడి డబ్బులు ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలా అని ఇప్పటి నుంచే జగన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచనలు మొదలుపెట్టిందన్నారు. అందులో భాగంగానే విద్యుత్ వాడకం 300 యూనిట్ల దాటితే అమ్మఒడి కట్ చేస్తామని ప్రకటించారని చెప్పారు. వేసవి కాలంలో విద్యుత్ వాడకం కచ్చితంగా పెరుగుతుందన్న నాదెండ్ల మనోహర్.. ఇప్పటి వాడకం ప్రకారం చూస్తే కచ్చితంగా ఎక్కువ యూనిట్లు ఉంటాయన్నారు. కావాలనే ఈ సమయాన్ని ఎంచుకుని అమ్మఒడి పథకానికి పేద తల్లులను అనర్హులను చేసేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైందని ఆయన ఆరోపించారు.”
పేదలు చాలా వరకు చిన్న ఇళ్లలో నివాసం ఉంటారు. వాళ్లకు నాలుగైదు వాటాలకు కలిపి ఒక మీటర్ ఉంటుంది. అలాంటప్పుడు కచ్చితంగా విద్యుత్ వాడకం అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆధార్ కార్డుల్లో జిల్లా పేరు మార్చుకోవాలనడం కరెక్ట్ కాదు. ఈ నిబంధన మండుటెండల్లో ప్రజలను ఆధార్ కేంద్రాల ముందు నిలబెడుతుంది. కాయకష్టం చేసుకుని బతికేవాళ్లు ఆధార్ కార్డుల్లో మార్పుల కోసం కచ్చితంగా రెండుమూడు రోజులు పనులకు దూరం కావాల్సి ఉంటుంది. ఏదో విధంగా తల్లులను అమ్మ ఒడికి దూరం చేయడమే సర్కారు ఉద్దేశంగా కనిపిస్తోంది” అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
