మీడియా పవర్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు అధికారులపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ ఫిర్యాదుతో అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆయనతో పాటు ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్ బాషాలపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాష్‌ను సర్వీస్ నుంచి ఎస్పీ ఫకీరప్ప డిస్మిస్ చేశారు. దాంతో తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అనంతపురం టూటౌన్ పీఎస్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇది ఇలాఉండగా, క్వార్టర్స్ ఖాళీ చేయాలంటూ భానుప్రకాశ్‌కు మంగళవారం నోటీసులు జారీ కావడం విశేషం. కానిస్టేబుల్ భానుప్రకాష్ వివాదం రోజురోజుకు ముదురుతుండడంతో రాష్ట్రంలో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయంలో ఎస్పీ ఫక్కీరప్ప టూ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోగానే సీఐ శివరాముడు కేసుకు సంభందించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీపై నమోదైన కేసును డీఐజీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని తెలిపారు. ఇతర జిల్లాలకు చెందిన ఉన్నతాధికారితో విచారణ జరిపించేందుకు డీఐజీ నిర్ణయించినట్లుగా సమాచారం.కానిస్టేబుల్ భానుప్రకాష్‌పై ఇప్పటివరకు 5 క్రిమినల్ కేసులు ఉండటంతో పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకుని విధుల నుంచి తప్పించారు. తాను దళితుడిని అయినందునే కుట్రపన్ని తనను విధుల నుంచి బహిష్కరణ చేశారంటూ భానుప్రకాష్ అనంతపురం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ భానుప్రకాష్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో విజ్ఞప్తిచేశారు. 2019 లో గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన ఓ కేసు కోర్టులో నడుస్తుండగా పోలీసు శాఖ విచారణ చేపట్టిందని భానుప్రకాశ్ తెలిపారు. ప్రస్తుత సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా, ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సీఐలు కృష్ణారెడ్డి, విజయభాస్కర్‌గౌడ్ ఆధ్వర్యంలో విచారణ జరిగిందని చెప్పారు. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలాన్ని మార్చేసి నేరం రుజువైందంటూ తనను ఉద్యోగంలో నుంచి డిస్మిస్ చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏపీ కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై కేసు
August 31, 2022
0
Tags