మీడియా పవర్, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి పడగ నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 67 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా మట్టి గణపతిని ప్రతిష్టించారు. 50 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో మట్టి గణపతిని ప్రతిష్టించడం ఓ రికార్డు. ఉప మండపాల్లో 22 అడుగుల ఎత్తులో స్వామి వారి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, ఎడమవైపు త్రిశక్తి మహాగాయత్రి దేవిని ప్రతిష్టించారు. కాగా అన్ని విగ్రహాలను పూర్తిగా మట్టితో రూపొందించడం విశేషం. ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం వాటిల్లకుండా పోలీసులు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసేవరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. భక్తుల వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.