మీడియా పవర్, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఇక్కడి జ్ఞాన సంపదను సమ్మిళితం చేసే కవులు, కళాకారులు అనడం అతిశయోక్తి కాదని శ్రీ గణేష్ యువజన సేవా సంఘం అధ్యక్షులు, అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్లశ్రీనుబాబు పేర్కొన్నారు. అటువంటి ప్రసిద్ద పేరు గాంచిన కళాకారులను గుర్తించి గురుపూజోత్సవం రోజు సత్కరించడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. సోమవారం విశాఖలోని డాబాగార్డెన్స్ వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో గురుపూజోత్సవం సందర్భంగా గురుశిష్య ప్రతిభా పురస్కార్ అవార్డులను రమేష్ ఎంటర్ టైనర్ అధినేత చదలవాడ రమేష్ బాబు(గురువు ), ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీ (శిష్యురాలు) లకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో కవులు,
రచయితలు, స్వచ్చంధ సంస్థలతో పాటు కళాకారుల పాత్ర కూడా అత్యంత ప్రశంసనీయమని కొనియాడారు. వివిధ రంగాల్లో ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన వారిని గుర్తించి తమ సంస్థ ద్వారా సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా గతంలో 45 మంది మహిళా పోలీసులను సత్కరించామని, ఆ తరువాత కళాకారుల సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులను, స్కూల్ ఆఫ్ థియేటర్ఆర్ట్స్ బాల కళాకారులను సత్కరించామన్నారు. ఇక గురు పూజోత్సవం సందర్భంగా ఏటా గురువులను సత్కరించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. గణేష్ యువజన సేవా సంఘం గడచిన 39 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోందన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది గాజువాకకు చెందిన రమేష్ ఎంటర్టైనర్స్ అధినేత చదలవాడ రమేష్ బాబు(గురువు), ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీ (శిష్యురాలు)లకు ఈ ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగిందన్నారు. వీరితో పాటు మరో 13 మంది కళాకారులను సత్కరించామని శ్రీనుబాబు తెలియచేసారు భవిష్యత్తులో కూడా ఆయా రంగాల్లో రాణించిన వారిని గుర్తించి గౌరవంగా సత్కరించుకోవడం జరుగుతుందన్నారు. కొంత మొత్తం ఆర్థిక సహాయం వీరికీ అందచేశారు. సన్మానగ్రహీతలు చదలవాడ రమేష్ బాబు, ఝాన్సీలు మాట్లాడుతూ తమ ప్రతిభను గుర్తించి గురుపూజోత్సవం రోజు సత్కరించి అవార్డులను అందజేసిన గణేష్ యువజన సేవా సంఘంకు కృతజ్ఞతలు తెలియజేసారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల మన్ననలు పొందే విధంగా అందరి ఆశీస్సులు కోరుతున్నామన్నారు. ఇప్పటికే అనేక సంవత్సరాలుగా తమ కళాకారుల బృందం అనేక ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందన్నారు. కళాకారులు ఆర్దికంగా బాగుంటేనే ఆయా ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉంటాయన్నారు. ప్రతిభాపాటవాలు ఉంటే తమవంటి కళాకారులకు ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి తాజాగా తమకు లభించిన ఆదరణే నిదర్శనమన్నారు. ప్రభుత్వం కూడ కళాకారులని ఆదుకోవాలని కొరారు. ఈ వేడుకలలో రమేష్ మాష్టర్ బృందం నిర్వహించిన డాన్స్ లు అలరించాయి. ఈ కార్య క్రమంలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ నిర్వాహకుడు అర్. నాగరాజ్ పట్నాయక్, రేస్ ఈవెంట్స్ అధినేత దాడి రవి కుమార్ తదితరులుపాల్గొన్నారు.
