మీడియా పవర్, అమరావతి: కాకినాడ జిల్లా తొండంగి మండలం కొత్త పెరుమాళ్లపురం, కోదాడ గ్రామాల పరిధిలో మందులు తయారు చేసే సంస్థల ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎన్.యువరాజ్ మంగళవారం లేఖ రాశారు. రాష్ట్రప్రభుత్వం అందజేసిన ప్రతిపాదనకు స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని ఆ లేఖలో పేర్కొన్నారు. మందుల తయారీ సంస్థల ప్రోత్సాహక పథకం కింద ప్రతిపాదిత పార్కులో ఉమ్మడి మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సహాయం (గ్రాంటు) అందజేస్తుందని తెలిపారు. స్టీరింగ్ కమిటీ నిర్ణయం ఆమోదయోగ్యమో కాదో 7రోజుల్లోగా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఈ పథకానికి ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఇఫ్కీకి మూడు నెలల్లోగా వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించాలని పేర్కొన్నారు. అత్యధిక ప్రమాణంలో మందుల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రాయితీలు, ప్రోత్సాహకాల వివరాలను ఆ లేఖకు జతచేశారు. దానిలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
పదేళ్లపాటు జీఎస్టీ రీయింబర్స్‌మెంట్
ఈ పార్కులో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అవి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి పదేళ్లు గానీ, స్థిర మూలధన పెట్టుబడిని 125 శాతం రాబట్టుకునే వరకూ గానీ జీఎస్టీని నూరుశాతం రీయింబర్స్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎంఎస్‌ఎంఈలకు మూలధన పెట్టుబడిలో 15% గానీ, గరిష్ఠంగా 20 లక్షల వరకు గానీ రాయితీగా ఇస్తామని తెలిపింది. 80% సామర్థ్యంతో మూడేళ్లపాటు విరామం లేకుండా ఉత్పత్తి చేసిన తర్వాతే రాయితీ అందజేస్తామని పేర్కొంది. కంపెనీలు చెల్లించే స్టాంపుడ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీని నూరుశాతం రీయింబర్స్ చేస్తామని తెలిపింది. ఇంకా పలు రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
