పనిమనిషిని చిత్రహింసలు పెట్టిన సీమా పాత్రా
సెప్టెంబర్ 12 వరకు రిమాండ్ విదించిన న్యాయస్థానం
రాంచీ: ఇంట్లో పనిచేసే మహిళను చిత్రహింసలకు గురిచేసినందుకు గానూ ఝార్ఖండ్‌కు చెందిన భాజపా నాయకురాలు సీమా పాత్రాను అరెస్టు చేసిన కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ దారుణాన్ని బయటపెట్టింది సీమా కుమారుడేనని జాతీయ మీడియా కథనాలు వెలువరిస్తున్నాయి. అతడే ఆ పనిమనిషికి సాయం చేసినట్లు పేర్కొన్నాయి.
ఝార్ఖండ్‌కు చెందిన భాజపా నాయకురాలు సీమా పాత్రా ఇంట్లో పనిచేసే పనిమనిషి సునీత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సీమా తనను బంధించి తీవ్రంగా కొట్టారని సునీత ఆ వీడియోలో తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం తెల్లవారుజామున సీమా పాత్రాను అరెస్టు చేశారు. అయితే ఈ వ్యవహారం బయటకు రావడానికి సీమా కుమారుడు ఆయుష్మాన్ కారణమని తాజాగా తెలిసింది.
పనిమనిషిని తన తల్లి చిత్రహింసలు గురిచేయడం భరించలేని ఆయుష్మాన్ ఆ విషయాన్ని ప్రభుత్వ అధికారి అయిన తన స్నేహితుడొకరికి చెప్పినట్టు జాతీయమీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఆమెకు సాయం చేయమని సీమా కుమారుడు తన మిత్రుడిని కోరినట్లు సదరు కథనాలలో పేర్కొన్నాయి. దీంతో ఆయుష్మాన్ స్నేహితుడు పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. అనంతరం పోలీసులు సీమా ఇంటికి వెళ్లి సునీతను రక్షించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని సునీత పోలీసులకు కూడా చెప్పినట్లు సమాచారం. ‘ఈ రోజు నేను బతికి ఉన్నానంటే అందుకు ఆయనే(ఆయుష్మాన్) కారణం’ అని కన్నీళ్లు పెట్టుకున్నట్లు సదరు కథనాలలో పేర్కొన్నాయి. సీమా కుమారుడు ఆయుష్మాన్ రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్నారు.