* గుడెపువలస లో దసరాకి గృహప్రవేశాలు
* నెలాఖరులోగా మౌలిక వసతులు పూర్తి చేయాలి
మీడియా పవర్, విజయనగరం, సెప్టెంబరు 13: భోగాపురం ఎయిర్ పోర్టు నిర్వాసితులకు సంబంధించిన గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి ఆదేశించారు. గూడెపు వలస గ్రామంలో దసరానాటికి గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్ లో భోగాపురం నిర్వాసితులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ పనుల పై జె.సి మయూర్ అశోక్ తో కలసి సమీక్షించారు. పొలిపల్లి, గూడెపువలస, బొల్లంకలపాలెం, రెల్లిపేట గ్రామాల్లో జరుగుతున్న పనులను వివిధ దశల వారీగా సమీక్షించారు. అంతర్గత రహదారులు, తాగునీటి సరఫరా, పోస్ట్ ఆఫీస్, అంగన్వాడీ భవనం వెల్నెస్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, సచివాలయం, వెటర్నరీ ఆసుపత్రి, డంపింగ్ యార్డ్, స్మశానం తదితర నిర్మానాలను వేగవంతం చేయాలన్నారు. అదే విధంగా రామాలయం, గ్రామ దేవత అమ్మవారి గుడులను కూడా సిద్ధం చేయాలన్నారు. పెండింగ్ ఉన్న రహదారి పనులకు తక్షణమే టెండర్లను పిలవాలని ఆర్ అండ్ బి ఈఈ కు సూచించారు. పెండింగ్ కోర్ట్ కేసు లన్నిటికీ కౌంటర్లు వేయడం పూర్తి అయినప్పటికీ త్వరగా పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. ఎయిర్పోర్ట్ కు అవసరమగు 2203 ఎకరాలకు గాను 2183 ఎకరాలకు వెజిటేరియన్ క్లియరెన్స్ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన 10 శాతం కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్.డి.ఓ సూర్యకళ, పంచాయతీ రాజ్ ఈఈ గుప్త, తహసీల్దార్ శ్రీనివాస రావు, డీఈ లు పాల్గొన్నారు.