అర్హతే ప్రామాణికం.. ప్రజల అభ్యున్నతే లక్ష్యం....మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
September 05, 2022
0
నెల్లూరు, మీడియా పవర్, 05 సెప్టెంబర్ 2022: అర్హతే ప్రామాణికంగా అన్నీ వర్గాల అభ్యున్నతే లక్ష్యం గా సంక్షేమ పధకాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని తోటపల్లిగూడూరు మండలం, సౌత్ ఆములూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గోవర్ధన్ రెడ్డి, ప్రతి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని, ప్రభుత్వం నుంచి వారికి అందిన సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత వివరాలతో కూడిన బుక్ లెట్ ను అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ, అర్హతే ప్రామాణికంగా అన్నీ వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సంక్షేమ పధకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మదిలో మెదిలిన సరికొత్త వినూత్న కార్యక్రమమే గడపగడపకు మన ప్రభుత్వమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సర్వేపల్లి నియోజక వర్గ పరిధిలోని తోటపల్లిగూడూరు మండల పరిధిలోని అన్నీ గ్రామాల్లో 105 కోట్ల రూపాయలతో సిమెంటు రోడ్లు, మురికి నీటి కాలువల నిర్మాణాలకు 2 కోట్ల 55 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారు సంక్షేమ పథకాల అమలు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ సందర్బంగా కొత్తగా మంజురైన డప్పు కళాకారుల, చర్మకారుల, మత్స్యకారుల మరియు చేనేత కార్మికుల పించన్ల ను లబ్దిదారులకు మంత్రి పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెరుకూరు సరళ కుమారి, ఎంపీడీవో హేమలత, తహసిల్దార్ శ్యామలమ్మ, వైయస్సార్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు
Tags