శ్రీకాకుళం: జిల్లాలో సిబ్బంది తమ పనితీరును మార్చుకుని మరింత మెరుగైన పనితీరు కనబరచాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జీవి చిట్టిరాజు సిబ్బందిని ఆదేశించారు. గురువారం జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో అధికారులతో పాటు మండల స్థాయి సిబ్బందితో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, సామాజిక తనిఖీ బృందాలు సిబ్బంది పనితీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని, పనితీరు మార్చుకోనట్లైయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఏడు రికార్డుల నిర్వహణ, జాబ్ కార్డుల పునరుద్ధరణ,వర్క్ ఫైల్స్, పని ప్రదేశాల్లో బోర్డుల ఏర్పాటు తదితర అంశాలు పట్ల అలసత్వం సరికాదన్నారు. హౌసింగ్ పనులు తొంబై పది దినాల సత్వరం పూర్తి చేయాలని సూచించారు. మండలాల్లో కూలీలకు సకాలంలో వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతిక కారణాలు రీత్యా ఎవరి వేతనాలు అయినా వారి ఎకౌంట్లో పడకుండా చెల్లింపులు ఆలస్యం జరిగితే అందుకు అవసరమైన చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని, లేనట్లయితే జిల్లా కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. వైయస్సార్ జలకల పథకంలో భాగంగా జిల్లాలో 246 బోరుబోవుల పనులు పూర్తి చేశామని, ఇంకా మిగిలిన పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్లాంటేషన్ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అమృత్ సరోవర్ చెరువు పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ మేనేజర్ స్వరూప రాణి, ఏపీడి పి రాధ, ప్లాంటేషన్ మేనేజర్ శ్యామల, సూపరిండెంట్లు ప్రసాదరావు, రవి, ఎం రవికుమార్, కె.వి అప్పలనాయుడు, అన్ని మండలాల ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
పనితీరు మారకుంటే చర్యలు తప్పవు -- డ్వామా పిడి "జీవి చిట్టిరాజు"
September 15, 2022
0
Tags