పార్వతీపురం, సెప్టెంబరు 15: గ్రేడ్-2 పర్యవేక్షకుల పరీక్షకు హాజరగు అభ్యర్దులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి జి. సుగుణ కుమారి తెలిపారు. మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆధ్వర్యములో సెప్టెంబరు 18వ తేదీన ఉదయం 10.00 గంటలకు విశాఖపట్నంలో నిర్వహించు గ్రేడ్-2 పర్యవేక్షకుల వ్రాత పరీక్షకు హాజరగు అర్హులైన అంగన్వాడీ కార్యకర్తలు, కాంట్రాక్టు గ్రేడు-1, 2 పర్యవేక్షకులకు సూచనలు జారీ చేసారు.
పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు సంబంధించిన సంబంధిత సి.డి.పి.ఒ. వారినుండి తీసుకోవాలని సూచించారు. హాల్ టికెట్ నందు నిర్దేశించిన పరీక్షా కేంద్రాన్ని ఒకరోజు ముందుగా చూసుకోవాలని, పరీక్షా సమయమునకు అరగంట ముందుగా అనగా ఉదయం 9.30 గంటలలోగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలోనికి 10.00 గంటల తర్వాత వచ్చిన వారిని ఎట్టి పరిస్థితులలోను అనుమతించరని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా హాలునకు హాల్ టికెట్, పరీక్ష అట్ట, నీలం లేదా నలుపు బాల్ పాయింట్ పెన్ను మాత్రమే తెచ్చుకోవలన్నారు. పరీక్షా కేంద్రమునకు ఎటువంటి పుస్తకాలు, స్లిప్పులు తదితర మెటీరియల్ అనుమతించరని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా హాలు నందు నిర్దేశించిన సమయం ప్రకారనం ఉదయము 10:00 గంటల నుండి మద్యహ్నం 12:30గంటల వరకు ఉండవలెనని, ముందుగా ఎవరిని బయటికి అనుమతించబడదని తెలిపారు. పరీక్ష హాలు నందు కాపీ చేయుట, ఇతరులతో సంభాపించుట చేసిన యెడల వారిని పరీక్షా హాలు నుండి పంపివేయబడునని తెలియజేస్తూ పరీక్షా హాలు నందు నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు.