నాడు-నేడు రెండవ విడత పనులు వేగవంతం చేయండి...పాఠశాల విద్య ప్రత్యేక ముఖ్యకార్యదర్శి

MEDIA POWER
0

మీడియా ప‌వ‌ర్‌, పార్వతీపురం, సెప్టెంబరు 15:  జిల్లాల్లో రెండవ విడతలో చేపడుతున్న జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లోని పనులు వేగవంతం చేయాలని,  మొదటి దశ కంటే మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు చేప‌ట్టాల‌ని  పాఠశాల విద్య ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు జి.శ్రీనివాసులు, నాడు-నేడు మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ సలహాదారు ఎ.మురళి,పాఠశాల విద్య కమీషనర్ సురేష్ కుమార్, పాఠశాల వసతులకల్పన కమిషనర్ కె. భాస్కర్ తో కలిసి   నాడు-నేడు రెండవ విడత కార్యక్రమం, అదనపు తరగతి గదులు నిర్మాణం, ప్రహరీ గోడలు, మౌలిక వసతుల కల్పన, రివాల్వింగ్ ఫండ్ జమ తదితర అంశాలపై  జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్షణ అదనపు పథక సమన్వయకర్తలు, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  అదనపు తరగతి గదులు, నాడు-నేడు, ప్రహరీగోడల నిర్మాణాలు పూర్తికావాలని పిలుపునిచ్చారు. రెండవ దశలో జరిగే నాడు - నేడు పనులు మరింత మెరుగ్గా ఉండాలన్నారు. నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. నాడు-నేడు కార్యక్రమం పారదర్శకంగా జరిగేలా కలెక్టర్లు చూడాలని, నిర్మాణ  పనులను పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంటు నిల్వలు అందజేసినట్లు తెలిపారు.  నిర్మాణాల అనంతరం వాటికి అవసరమైన గ్రీన్ బోర్డ్స్, ఫ్యాన్స్, విద్యుత్‌, తాగునీరు, తదితర అంశాలపై చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ‌సేక‌ర‌ణ ద్వారా తీసుకోవలసిన సామ‌గ్రి వివ‌రాల‌ను పంపించాలని తెలిపారు.   బాలికలపై లైంగిక వేదింపులను అరికట్టుటకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.  లైంగిక వేదింపులపై బాలికలకు అవగాహన కల్పించుటకు ప్రతి పాఠశాలనందు మోరల్ టీచరును నియమించాలని, ప్రతి పాఠశాలలో విద్యార్థినుల సమస్యలను తెలియజేసుకొనుటకు పిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేయాలని తెలిపారు. 

   జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  సమీక్షా  సమావేశం లో జిల్లాలో జరుగుతున్న  పనుల ప్రగతిని  వివరించారు.  జిల్లాలో  రెండవ విడత నాడు-నేడు పనులకు 531 పాఠశాలలు, 14 జూనియర్ కాలేజీలను ఎంపిక చేయడం జరిగిందని, 423 పాఠశాలలకు రివాల్వింగు ఫండ్ విడుదల అయినదని తెలిపారు. నిర్మాణపనులకు అవసరమైన సిమెంటు, ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.   

   ఈ కార్యక్రమం లో  గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈ ఈ ప్రభాకర్, జిల్లా పంచాయితి అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అదికారి బ్రహ్మాజీ యితర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">