రాష్ట్రంలోని అందరి జీవన ప్రమాణాలు పెరగాలన్నదే మా లక్ష్యం...-మంత్రి ధర్మాన ప్రసాదరావు

MEDIA POWER
0

-    విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దంటే చూస్తూ ఊరుకోవాలా..?

- అమరావతిలో  భూముల ధరలు పెరుగుతుంటే రాష్ట్రమంతా చప్పట్లు కొట్టాలా?

-   హైదరాబాద్ నేర్పిన పాఠం చూశాక కూడా.. బాబుకు ఎందుకు అర్థంకావడం లేదు

- విశాఖకు రాజధాని వద్దు అని బాబు అండ్ కో మాట్లాడటం చాలా పెద్ద తప్పు

- సంపద కొద్ది మంది చేతుల్లో ఉండాలన్నది మేం అంగీకరించం

- రాష్ట్ర భవిష్యత్తుకు ‘వికేంద్రీకరణే’ సరైన నిర్ణయం

-65 ఏళ్ళ పాటు ఉమ్మడిగా నిర్మించిన హైదరాబాద్‌ మనది కాకుండాపోయింది

- అమరావతిని రాష్ట్ర సమస్యగా సృష్టించాలన్నదే చంద్రబాబు ప్రయత్నం

- అరసవల్లి వచ్చి దేవుడిని దర్శించుకోండి కానీ.. మా పీక కోసే పనులు చేయొద్దు

- ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలంతా కూలీలు, పనిమనుషులుగా మిగిలిపోవాలా..?

- జీడీపీలో శ్రీకాకుళం వాటా ఎంతో చెప్పండి..?

- జీవన ప్రమాణాల్లో అట్టడుగున శ్రీకాకుళం

- అమరావతి నిర్ణయం కరెక్టే అయితే..  మీరు అక్కడ ఎందుకు గెలవలేదు?

- 29 గ్రామాల ప్రజలు చంద్రబాబు మాయలో పడొద్దు

- టీడీపీ ప్రభుత్వంలో కేంద్రం 23 సంస్థలిస్తే.. శ్రీకాకుళంలో ఒక్కటైనా పెట్టావా..?

- రాష్ట్ర మంత్రి ధర్మాన సూటి ప్రశ్నలు

    మీడియా పవర్,  శ్రీకాకుళం: విశాఖ పరిపాలనా రాజధానిగా వద్దొంటూ మీరు పాదయాత్ర చేస్తుంటే.. మేం నోరు మూసుకుని కూర్చోవాలా..?, మీరు మా పొట్ట కొడుతుంటే.. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటికీ కూలీలుగా, తాపీ మేస్త్రీలుగా, ఇళ్ళల్లో పనిమనుషులుగానే మిగిలిపోవాలా..? అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సూటిగా ప్రశ్నించారు.  విశాఖకు పరిపాలన రాజధాని వద్దని చంద్రబాబు అండ్ కో మాట్లాడటం చాలా పెద్ద తప్పుని అన్నారు. 40 ఏళ్ళకు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్  విషయంలో ఏం జరిగిందో తెలియదా అని  ప్రశ్నించారు .రాష్ట్ర విభజనతో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైనదని ధర్మాన ప్రసాదరావు అన్నారు. అమరావతి ప్రాంతంలో ఉన్నవారి భూములు, ఆస్తులు పెరుగుతుంటే దానికి రాష్ట్రమంతా చప్పట్లు కొట్టాలా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు విని అరసవెల్లి దేవుడ్ని దర్శనం చేసుకోండి తప్పులేదు.  కానీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల పీకకోసే పనిచేస్తామంటే అది తప్పు అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 

అమరావతిని రాష్ట్ర సమస్యగా చిత్రీకరించాలని టీడీపీ చూస్తోంది.

    అమరావతి అనేది రాష్ట్రం మొత్తానికి సంబంధించిన సమస్యగా చిత్రించాలని రాష్ట్రంలోని టీడీపీ, ప్రతిపక్షనేత చంద్రబాబు, వారికి చెందిన ఓ వర్గం మీడియా అనేక ఎత్తుగడలు వేస్తున్నార‌ని అన్నారు. రైతాంగం పోరాటం చేస్తున్నట్టుగా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి మిగతా ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని, రాజధాని మీద వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అసెంబ్లీలో  సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ సభలో వైయస్‌ఆర్‌ సీపీ సభ్యుడిగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన మంత్రిగా అనేక అనుభవాలు, వాస్తవాలను వివరించడం జరిగిందని తెలిపారు.  అమరావతిని రాజధానిగా చేయడం వెనుక ఉన్న దురుద్దేశపూరితమైన అక్రమ సంపాదన కోసం చేస్తున్న పనిని, వారి అబద్ధాలు,అసత్యాలను శాసనసభలో సుదీర్ఘంగా వివరించడం జరిగిందన్నారు.

హైదరాబాద్ నేర్పిన పాఠం చూశాక కూడానా..?

    ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ రాజధానిగా ఉన్న విష‌యం మ‌నంద‌రికీ తెలిసిన‌దే.  హైదరాబాద్‌ను విడిచి రాష్ట్రాన్ని విడదీస్తామంటే ఏకకంఠంతో వీల్లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చెప్పారు. హైదరాబాద్‌ను వదులుకోమని ఎందుకు చెప్పామో ప్రజలంతా ఆలోచన చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత 65 సంవత్సరాలు పెట్టుబడిని హైదరాబాద్‌లో పెట్టాం. అభివృద్ధి చేశాం. దేశ దృష్టిని ఆకర్షించే పట్టణంగా హైదరాబాద్‌ ఎదిగింది. అనేక ఉద్యోగాలు, రెవెన్యూ, ఇండస్ట్రీ అన్నీ హైదరాబాద్‌కు వచ్చాయి. తరువాత ఆ ప్రాంతంలో ఉన్నవారందరికీ ఆంధ్రప్రదేశ్‌ ను విభజిస్తే హైదరాబాద్‌ మనకే ఉంటుంది కదా. ఫలాలు  అన్నీ మనమే పొందొచ్చు కదా అనే స్వార్థం పెరిగింది. అది తప్పు అని నేను అనను. అందుకోసం ఉద్యమం పెద్ద ఎత్తున నడిపారు. ఏపీ మొత్తం వ్యతిరేకించింది. కాని చివ‌ర‌కు ఏమైంది? అంద‌రికీ తెలిసిన విష‌య‌మే..అన్నారు.

    ఉమ్మడి రాష్ట్రానికి లభించిన రెవెన్యూను అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేట్టుగా ఆనాడే పెట్టుబడి పెట్టి ఉంటే మిగతా అనేక రాష్ట్రాలు చేసినట్టుగా మనం కూడా చేసి ఉంటే ఇలాంటి ప్రమాదం రాష్ట్రానికి జరిగి ఉండేది కాదు. ప‌రిశ్ర‌మ‌లు రాష్ట్రం నలుమూలలా పెట్టి, నలుచోట్ల నగరాలు అభివృద్ధి చేసి ఉంటే ప్రత్యేక తెలంగాణ కోరేవారు ఉండేవారు కాదు. ఒకవేళ కోరితే ఇవ్వడానికి ఆవేదన చెందాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. రాష్ట్రం విడిపోయిన తరువాత మనం పొరపాటు చేశామని అంతా గుర్తించాం. మళ్ళీ అటువంటి తప్పు జరగకూడదన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. 

అమరావతిలో లక్షల కోట్లు పెడితే మళ్ళీ పాత కథే పున‌రావృతం అవుతుంది.

    అమరావతిలో 33 వేల ఎకరాలు తీసుకుని, అక్కడ నాలుగు ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో, మరో 60–70  సంవత్సరాలు దానిపై పెట్టుబడి పెడితే  తెలంగాణలో జరిగిన పనే మళ్లీ జరగదని ఎవరైనా చెప్పగలరా ? మా ప్రాంతాన్ని విడిచివెళ్లండి అని భవిష్యత్తులో ఉత్తరాంధ్ర, రాయలసీమ వారు అంటే.. ఇప్పుడు నష్టపోయిన 65 సంవత్సరాలు కాకుండా మరో 60 సంవత్సరాలు వెన‌క్కి వెళ్ళ‌క త‌ప్ప‌దు. అందుకోసమే ఈ విధానాన్ని ప్రపంచంలో ఎక్కడా అంగీకరించడం లేదు. ఒకేచోట పెట్టుబడంతా పెట్టి.. అభివృద్ధి చేసే విధానం  అంగీకారం యోగ్యం కాదు.

అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందే విధానం బాబుకు న‌చ్చ‌దు.  అందుకే అంగీకరించడు.

    రాజ్యాంగంలో ఏముందంటే ఒక రాష్ట్రానికి లభించిన వనరులు, నిధులు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి వీలుగా నిర్ణయాలు చేయాలనే సూచన ఉంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించి శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా అదే సూచించింది. సారవంతమైన భూములు వద్దని, నిస్సారవంతమైన మెరక ప్రాంతాలకు వెళ్లాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసే విధానం ఉండాలని సూచన చేశారు. ఇవన్నీ ఎందుకు మరుగునపెట్టారు..? 40 ఏళ్లు రాజకీయాల్లో అనుభ‌వం, 14 సంవత్సరాలు అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌ను వదులుకున్నందుకు జరిగిన నష్టాన్ని గ్రహించాలి కదా! అయినా ఎందుకు చేస్తున్నారు అంటే అందులో స్వార్థం ఉంది. లేదంటే అన్ని ప్రాంతాలకు అవకాశం ఉండే విధానాన్ని చంద్రబాబు ఎందుకు అంగీకరించడం లేదు..?

అమరావతి చుట్టూ బాబు సన్నిహితులు, శ్రేయోభిలాషులు, బంధువుల భూములే

    33 వేల ఎకరాల అంచున ఉన్న భూములన్నింటినీ చంద్రబాబు స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధువులు, టీడీపీ నేతలతో కొనిపించారు. రాజధాని నిర్మాణం చేస్తాననే పేరుతో వారందరి ఆస్తుల విలువలు పెంచాలనే వ్యూహంలో, చంద్రబాబు స్వార్థం ఉంది. అందుకోసమని సింగపూర్‌తో గవర్నెమెంటు ఒప్పందం అన్నారు. అది కాదని తెలిసిపోయింది. ఎందుకు చంద్రబాబు అబద్ధం ఆడారు..?. సింగపూర్‌ పార్లమెంట్‌లో ఈశ్వరన్ అనే మంత్రి సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాడు. అవన్నీ అసెంబ్లీలో నేను ప్ర‌స్తావించాను అని చెప్పారు మంత్రి ధ‌ర్మాన‌.

అమరావతి రాజధానిగా వద్దని మేము అనటం లేదే

మొదట రాజధాని దొనకొండ అని, నూజివీడు అని చంద్రబాబు ఎందుకు ప్రచారం చేశారు. దీంట్లో పూర్తిగా స్వార్థం ఉందని తెలిసిపోతుంది. ప్రజలంతా గుడ్డిగా ఉన్నారా..? అసలు మా ప్రభుత్వం క్యాపిటల్‌ అమరావతిలో వద్దని చెప్పటంలేదు. సీఎం వైయస్‌ జగన్ గారు, ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే  విధంగా ఉండాలని చెబుతున్నారు. దానికి గానూ శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ కమిటీ సూచనకు, రాజ్యాంగం చెప్పినదానికి, రాష్ట్ర ప్రజల కోరికకు ఈ ప్రతిపాదన అనుగుణంగా ఉంది. 

విశాఖకు క్యాపిటల్ వద్దంటే ఉత్తరాంధ్ర ప్రజలు నోరుమూసుకుని కూర్చోరు.

విశాఖపట్నానికి క్యాపిటల్‌ వద్దంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు ఊరుకోవాలి ? మీరు యాత్ర చేస్తే మేము నోరు మూసుకొని కూర్చోవాలా..? గడిచిన టీడీపీ ప్రభుత్వ కాలంలో కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలు రాష్ట్రానికి ఇస్తే.. ఒక్క సంస్థ కూడా చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పెట్టలేదు. మేము నోరుమూసుకొని ఊరుకోవాలా..? రైతులను రెచ్చగొట్టి మా మీదకు పంపిస్తున్నాడు. రైతులతో మాకు ఎలాంటి వివాదం లేదు. 29 గ్రామాల్లోని రైతులకు న్యాయం జరగాలని వైయస్‌ఆర్‌ సీపీ కోరుకుంటుంది. రైతుల ముసుగులో ప్రజలందరి రాజ్యాంగ హక్కులను హరించడం, గడిచిన కాలంలో జరిగిన మోసం మళ్లీ జరగడానికి, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వాసులకు అభివృద్ధి అక్కర్లేదని నోరు నొక్కడానికి చంద్రబాబు చేసే ప్రయత్నాన్ని మేము అంగీకరించం. 

రాజధానిగా విశాఖకు అర్హత లేదని మీరు భావిస్తున్నారా?

రాజధానిగా విశాఖపట్నం అనర్హం అయ్యిందని మీరు గమనించి ఉంటే టీడీపీ  అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటి క్యాబినెట్‌ మీటింగ్‌ విశాఖలో ఎందుకు పెట్టారు? విశాఖ రాజధానికి అర్హత ఉన్న సిటీ అని చంద్రబాబు గతంలో అంగీకరించారు. అలా అని అన్ని క్యాపిటల్స్‌ విశాఖలోనే పెట్టాలని చెప్పటం లేదు. పరిపాలన రాజధాని విశాఖలో, న్యాయరాజధాని కర్నూలులో, అమరావతిలో శాసన రాజధాని అని ప్రభుత్వం ప్రకటించింది కదా.. దాంట్లో మోసం ఏముంది..?  మా ఈ ప్రభుత్వం ఏనాడూ ఒక్క మాట కూడా అబద్ధం చెప్పలేదు. అమరావతి రాజధాని విషయంలో చంద్రబాబు ఇప్ప‌టికీ అబద్ధాలు చెప్తూనే ఉన్నారు.  ఎక్కడెక్కడో అని ప్రచారం చేసి అందరి చేత భూములు కొనిపించి సడన్‌గా అమరావతి అని డిక్లేర్‌ చేశారు. కేంద్రం సారవంతమైన భూములు రాజధానికి వద్దని చెప్పినా పట్టించుకోలేదు. కేంద్ర కమిటీ సూచనను తుంగలో తొక్కారు.   సింగపూర్‌తో జీ2జీ ఒప్పందం అని అబద్ధం చెప్పారు. సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలతో చంద్రబాబు చేసుకున్న లోపాయకారి ఒప్పందాలను అమలు చేయడానికి ఈ మాయలన్నీ చేశాడు. ముఖ్యమంత్రి మాయ చేయాల్సిన అవసరం ఏంటీ..? సీఎం వైయస్‌ జగన్‌ గారు స్థిర‌మైన అభిప్రాయంతో జ‌న‌రంజ‌క పాల‌న చేస్తున్నారు. అర్హులైన అంద‌రికీ సంక్షేమాలు   అందిస్లున్నామ‌ని అన్నారు.  పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజల ఆకాంక్ష అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన అన్యాయం మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకే సీఎం వైయస్‌ జగన్ ప‌ని చేస్తున్నార‌ని ప్ర‌జారంజ‌క పాల‌న అందిసస్తున్నార‌ని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">