మీడియా పవర్, శ్రీకాకుళం, సెప్టెంబర్ 12 : జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో ఇచ్చిన లక్ష్యాలతో పాటు తొలి త్రైమాసికంలో పరిష్కరించబడని లక్ష్యాలను కూడా అధిగమించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. రైతులకు లబ్ధిచేకూరేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆర్.బి.ఐ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ తేల్చి చెప్పారు. తొలి త్రైమాసికంలో రాష్ట్రంలో జిల్లాను ప్రధమ స్థానంలో నిలిపినందుకు సహకరించిన బ్యాంకు అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఇదేస్ఫూర్తితో రెండవ త్రైమాసికంలో కూడా లక్ష్యాలను అధిమించాలని కలెక్టర్ ఆకాక్షించారు.
సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం(డి.ఎల్.ఆర్.సి) లో జిల్లా సంప్రదింపుల కమిటీ(డి.సి.సి) పాల్గోంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న శుక్రవారం నుండి అక్టోబర్ మాసాంతం వరకు వివిధ ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించాల్సి ఉందని అన్నారు. అందులో భాగంగా ప్రతి బ్యాంకు అధికారులు ఆయా మండల పరిధిలోని ఎం.పి.డి.ఓ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేసి లబ్ధిదారులకు రుణాలను మంజూరుచేయాలని స్పష్టం చేశారు. అలాగే డిసిసి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తప్పనిసరిగా ఆచరించాలని పేర్కొన్నారు. సమావేశానికి కొందరు బ్యాంకు అధికారులు గైర్హాజరు కావడంపై మెమోలను జారీచేయాలని ఎల్.డి.ఎంను కలెక్టర్ ఆదేశించారు. ఇకపై ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు కారదని ఆదేశించారు. టిడ్కో గృహాలకు రుణాలు మంజూరులో సిబిల్ స్కోర్ చూస్తున్నారని, ప్రభుత్వం మంజూరుచేసే ఈ గృహాలకు సిబిల్ నుండి మినహాయింపు ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే ప్రతి లబ్ది బ్యాంకుల ద్వారానే జరుగుతున్నందున, వారికి అవసరమైన రుణాలను సకాలంలో మంజూరుచేయాలని, ఇందులో అలసత్వం వహిస్తే సహించబోమని అన్నారు. జగనన్న తోడు కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని, జిల్లాలో అత్యధికంగా మంజూరు కాని పథకాల్లో జగనన్న తోడు ఉందన్నారు. త్వరితగతిన వీటిని మంజూరుచేయాలని తెలిపారు. జిల్లాలో 17వేల 601 మంది దరఖాస్తు చేసుకోగా, 11వేల 410 మంది అర్హులుగా గుర్తించారని, వారిలో ఈ త్రైమాసికంలో 6వేల 9వందల మందికి మంజూరు చేసేందుకు లక్ష్యం నిర్ణయించి ఇప్పటివరకు 1వేయి 114 మందికి మాత్రమే మంజూరు చేశారన్నారు. మిగిలినవి త్వరగా మంజూరుచేయాలని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ, విద్య, ఎం.ఎస్.ఎం.ఇ, చేనేత కార్మికులు తదితర రుణాల మంజూరులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర,సిటీ యూనియన్ బ్యాంక్, కోటక్ మహేంద్ర, డి.బి.ఎస్,బంధన్ బ్యాంక్, ఇండియన్ ఓవెర్సెస్ బ్యాంక్, యూకో, యాక్సిస్, హెచ్.డి.ఎఫ్.సి, ఐ.డి.బి.ఐ,కరూర్ వైశ్య బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ వెనుకబడి ఉండటంపై ఆరా తీశారు. రెండో త్రైమాసికంలో లక్ష్యాలను సాదించి తీరాల్సిందేనని తెలిపారు. నాడు-నేడు బ్యాంకు ఖాతాల తెరవడంలోనూ, చెక్ బుక్ మంజూరులో ఆంక్షలు ఉండరాదని అన్నారు. ప్రభుత్వం ఇంత పెద్దఎత్తున చేపడుతున్న కార్యక్రమంలో అవాంతరాలు ఉండరాదని స్పష్టం చేశారు. వై.ఎస్.ఆర్ చేయూత, ముద్ర , కాపు, బ్రాహ్మణ, మైనారిటీ, క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రుణాలు త్వరితగతిన చేపట్టాలని తెలిపారు. బ్యాంకుల ద్వారా మంజూరు చేసే లబ్ధిదారుల వివరాలను సంబంధిత శాఖలకు ఇచ్చేలా బ్యాంకు అధిపతులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం యాక్షన్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని బాంక్ అధికారులతో కలిసి విడుదల చేసారు.
లీడ్ బ్యాంక్ మేనేజర్ జి.వి.బి.డి.హరిప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో 318 బ్యాంకులకు గాను పునర్విభజన అనంతరం 274 బ్యాంకులతో, 342 ఏ.టి.ఎంలతో కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పారు. 12వేల 9వందల 87 కోట్ల రుణాలు ఉండగా,సుమారు 11వేల డిపాజిట్లు ఉన్నాయన్నారు. రుణ మంజూరులో జిల్లా ప్రధమ స్థానంలో ఉందని తెలిపారు. కొన్ని బ్యాంకులు రుణ మంజూరులో వెనుకబడిఉన్నాయని,రెండవ త్రైమాసికంలో లక్ష్యాలు అధిగమించే అవకాశం ఉందని అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు డా.పి.వి.విద్యాసాగర్, నాబార్డ్ డి.డి.ఎం వరప్రసాదరావు, ఆర్.బి.ఐ ఎల్.డి.ఓ ఎస్.అనిల్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి కె.శ్రీధర్, జిల్లా ఉద్యానవన అధికారి ఆర్.వి.వి.ప్రసాదరావు, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త డా.ఆర్.జయప్రకాష్, యూనియన్ బ్యాంక్ డెప్యూటీ రీజనల్ అధికారి వై.ప్రేమ్ బాబు, ఎస్.బి.ఐ రీజనల్ నిర్వాహకులు టి.ఆర్.ఎం.రాజు, శ్రీకాకుళం, పార్వతీపురం ఏ.పి.జి.వి.బి ప్రాంతీయ నిర్వాహకులు ఎం.సుధాకర్, బి.రాఘవేంద్ర, డి.సి.సి.బి ముఖ్యకార్యనిర్వహణాధికారి ప్రసాదరావు, యూనియన్ బ్యాంక్ ఏ.ఎల్.డి.ఎం ఎన్. వి.రమణ, ఎఫ్.ఎల్.సి కె.గిరిజాశంకర్, వివిధ బ్యాంకుల అధిపతులు తదితరులు పాల్గొన్నారు
మూలం : పౌరసంబంధాల శాఖ ... శ్రీకాకుళం జిల్లా
