విశాఖపట్నం: పరిశ్రమలలో తగు భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారా ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక వుడా చిల్డ్రన్ ఎరీనా లో పరిశ్రమలలో జరుగుతున్న ప్రమాదాలు వాటి నివారణ చర్యలపై పారిశ్రామికవేత్తలు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రశాంత నగరంగా గుర్తింపు పొందిన విశాఖలో ఇటీవల కాలంలో పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు సంభవించటం విచారించ తగ్గ విషయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అదే విధంగా పారిశ్రామిక అభివృద్ధికి కూడా అంతే ప్రాధాన్యతను కల్పిస్తున్నదని, పరిశ్రమల వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని గుర్తు చేసారు. విశాఖలో సహజ వనరులతో పాటు రెండు పోర్టులు, నేవీ ఉండగా త్వరలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మెట్రో రైలు ప్రాజెక్ట్ రానున్నాయని వీటి వలన నగరం, జిల్లా, రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోనున్నాయి అన్నారు. పరిశ్రమలకు భద్రతాపరంగా శాశ్వత ప్రాతిపదికన అనుమతులు ఉన్నప్పుడే ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవస్థ సాఫీగా జరుగుతుందని , దీనివలన యాజమాన్యంతో పాటు సిబ్బంది, ప్రజలు సురక్షితంగా ఉంటారన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ మార్గ దర్శకాలు, నియమ నిబంధనలకు అనుగుణంగా భద్రతా ప్రమాణాలను పాటిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు సంభవించకుండా నియంత్రించగలమన్నారు.
జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఇటీవల కాలంలో జిల్లాలో పారిశ్రామిక ప్రమాదాలు ఎల్జి పాలిమర్ రెండు ఫార్మా కంపెనీలలో ప్రమాదాలు సంభవించడం ద్వారా ప్రాణ నష్టం తో పాటు ప్రజలు భయాందోళనకు గురి కావడం జరిగిందన్నారు. జాతీయ స్థాయి ప్రత్యేక నిపుణులతో కూడిన హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికలో ముఖ్యంగా పరిశ్రమలలో ప్రోటోకాల్ ఉల్లంఘన మరియూ మానవ తప్పిదాల వలన ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారన్నారు. ఆగష్టు 2వ వారంలో రాష్ట్రస్థాయిలో పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాబట్టి అన్ని పరిశ్రమల యాజమాన్యం
వారి మేనేజ్మెంట్ తో సమావేశాన్ని నిర్వహించుకొని గత సంవత్సరాలలో జరిగిన ప్రమాదాలు, ఇతర ప్రాంతాలలో గల ఫ్యాక్టరీలలో జరిగిన ప్రమాదాలతో బేరీజు వేసుకొని ఇటువంటి ప్రమాదాలు భవిష్యత్ లో పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకునే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే కొన్ని రోజుల పాటు ఫ్యాక్టరీ ను షట్ డౌన్ చేసుకొని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి తిరిగి పునః ప్రారంభించడం వలన సంబంధిత పరిశ్రమల యాజమాన్యానికి,సిబ్బందికి, ప్రజలకు, ప్రభుత్వానికి ఎటువంటి నష్టం ఉండదన్నారు.
నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా మాట్లాడుతూ ఇటీవల పరిశ్రమలలో జరిగిన ప్రమాదాలు మానవ తప్పిదంగా గుర్తించడం జరిగిందన్నారు .పరిశ్రమల భద్రత పై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. సాంకేతిక నైపుణ్యం గల సిబ్బంది ని ప్రోటోకాల్ ప్రకారం విధులను నిర్వహించే విధంగా శిక్షణ ఇవ్వాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాలలో మాక్ డ్రిల్ నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించినట్లవుతుందన్నారు. ఫార్మా కంపెనీల పరిసర ప్రాంతాల్లో హాస్పిటల్ ఉంటే , ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను వెంటనే ప్రాథమిక చికిత్స అందించే అవకాశం వుంటుందన్నారు.
ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు ఎం వి వి సత్యనారాయణ , గొట్టేటి మాధవి, శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి , జీ వి ఎం సి కమిషనర్ జి సృజన, జి ఎం డీ ఐ సి రామలింగరాజు, పారిశ్రామికవేత్తలు, అధికారులు హాజరయ్యారు.
నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలి
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
ఈ నెల 20 నుండి 29 వరకు పరిశ్రమల పై ఏర్పాటు చేసిన కమిటీలు పరిశీలిస్తారు.
విశాఖపట్నం: కొత్తగా వచ్చిన పరిశ్రమలు ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో జరుగుతున్న సంఘటనలు, నివారణ చర్యలపై పరిశ్రమల యాజమాన్యం, అధికారులతో విఎంఆర్డిఎ చిల్డ్రన్ ఎరీనాలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో విలేఖరులతో ఆయన మాట్లాడారు. గత రెండు నెలల నుండి పరిశ్రమల్లో జరుగుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకొని పరిశ్రమల యాజమాన్యం, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో తగు సూచనలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. అగ్నిమాపక శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, బాయిలర్స ఫ్యాక్టరీస్ శాఖలు సమన్వయంతో పని చేసుకోవాలన్నారు. ఆయా శాఖలు పరిశ్రమలను అప్పుడపుడు చెకింగ్ చేయాలన్నారు. ఫైర్ సేప్టీని అన్ని పరిశ్రమలు పాటించాలని చెప్పారు. పరిశ్రమలు నిర్మాణం జరుగుతున్నపుడే ఫైర్ సేఫ్టీ ని పాటించాలని తెలిపారు. ఎల్.జి. పాలిమర్స సంఘటనతో సంబంధం వున్నా అధికారులను సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు పాటించి పనిచేయాలని, ఏ మాత్రము వెసులుబాటు ఇచ్చినా ప్రజల ప్రాణాలు పోతాయన్నారు. పరిశ్రమలు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిష్పక్షపాతంగా ఉండాలని అధికారులకు చెప్పినట్లు పేర్కొన్నారు. పరిశ్రమలను రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లుగా విభజించడమైనదని, పరిశ్రమల పరిశీలనపై జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కమిటీలను ఏర్పాటు చేయడమైనదని, ఈ కమిటీలు ఈ నెల 20 నుండి 29 వరకు ఆయా పరిశ్రమలను సందర్శించి, కమిటీలు తగు సూచనలు జారీ చేస్తాయని, ఆయా పరిశ్రమలు సూచనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించమని తెలిపారు. నాలుగు శాఖలు సమన్వయంతో చేయాలన్నారు. ప్రభుత్వం తరఫున లోపం లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పరవాడ ఫార్మా సిటీలో ఒక ఆసుపత్రి నిర్మాణంనకు ఆయా ఫార్మా కంపెనీలు నిధులను సమకూర్చుకున్నాయని, భూ సమస్య వలన నిర్మాణం జరగలేదని, భూ సమస్యను పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఫార్మా సిటీలో మౌళిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో అరకు పార్లమెంటు సభ్యులు జి. మాధవి, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.