మీడియా పవర్, విశాఖపట్నం,సెప్టెంబరు 13: జిల్లాలోని అన్ని ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలు,వ్యాపార సంస్థలు వాటి నామ పలకాలను (బోర్డులను) 3నెలలలోపలే తెలుగులో రాసేలా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్ల గడ్డ లక్ష్మి ప్రసాద్ పోలిసు అధికారులకు సూచించారు. మంగళవారం ఉదయం పోలిసు శాఖలో తెలుగు భాష అమలు తీరు పై పోలిసు కార్యాలయంలోని సమావేశ మందిరములో ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బముగా రాష్ట్ర తెలుగు భాషా సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ పోలిసు శాఖలో విధి నిర్వహణలో ఉత్తర ప్రత్యుత్తరాలను అత్యధికంగా తెలుగులో జరపాలని సూచించారు. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధికారాలున్నాయని అయితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుగు వినియోగించి భాష గోప్ప తనాన్ని ముందుకు తిసుకువెళ్లే కృషి చేయాలన్నారు. విదేశాలలో తెలుగు వారు తెలుగు భాషను ఎంతగానో వినియోగిస్తున్నారని మన మాతృభాష మాధుర్యిన్ని అందరికీ పంచుతున్నారని తెలిపారు.
తెలుగు భాషా అభివృద్దికి చరిత్రలో కృషి చేసిన మహనీయులు ఎందరో ఉన్నారని వివరించారు. పత్రికలు, ప్రసారాలు మాధ్యమాలు తెలుగు అభివృద్దికి కృషి చేయాలన్నారు. తెలుగు భాషోద్యమకారులను గౌరవించాలని, వారి కార్యక్రమాలకు చేయూత నివ్వాలన్నారు. తెలుగులో కార్యక్రమాలను, పద్య నాటకాలను ప్రోత్సహిస్తూ తెలుగు తీయదనాన్ని ఆశ్వాదించాలని సూచించారు.
సాంకేతిక సాధనాలైన కంప్యూటర్లు, సెల్ ఫోన్ల లోనూ తెలుగు ఫాంట్ ను డౌన్ లోడ్ చేసుకోని తెలుగులో చర్చించుకోవాలన్నారు. ఇ –పైలింగ్, ఇ- ఆఫీసులలో తెలుగును వినియోగించాలన్నారు. సంకల్పంతో కృషి చేస్తే మానవుడు సాదంచలేనిది ఏదీలేదని తెలిపారు.
నగర పోలీసు కమీషనరు సి.హెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ పోలీసు శాఖలో తెలుగు వినియోగాన్ని పెంచడానికి కృషి చేస్తామని తెలిపారు. నోటు ఫైల్ మెుదలు కొని చివరి వరకు తెలుగు భాష అమలుకు కృషి చేస్తామన్నారు. గ్రామ స్థాయి నుండి తెలుగు వినియోగానికి చర్యలు చేపడతామన్నారు. వచ్చే మూడు నెలల లోగా దుకాణాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి నామ ఫలకాలు, బోర్డులు, మరియు ఇతర ప్రచార సామగ్రి తెలుగు భాషలో ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
డిసిపి సుమిత్ సునీల్ గరుడ్ మాట్లాడుతూ ఎపిపిఎస్సి నిర్వహించే తెలుగు భాషా పరీక్షకు సిద్దం కావడానికి అవసరమైన పుస్తకాలు, క్రాష్ కోర్సులు అవసరం ఉందని అధ్యక్షుల వారి దృష్టి కి తెచ్చారు.
తెలుగు అధికార భాషా సంఘం సభ్యుడు మీగడ రామలింగస్వామి తెలుగులో పలు పద్యాలను వినిపించి తెలుగు భాష గొప్పదనాన్ని చాటి చెప్పారు. చివరగా ఎసిపి ఆర్.వి.ఎస్.ఎన్ మూర్తి వందన సమర్పణ గావించారు. ఈ సమావేశంలో సమాచార శాఖ ఉపసంచాలకులు వి.మణిరామ్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
మూలం: ఉపసంచాలకులు, జిల్లా సమాచార పౌర సంబందాల కార్యాలయం, విశాఖపట్నం .